మందమర్రిలో జరిగిన 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, పంట మార్పిడి ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. అధిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులను పాటించాలని సూచించారు.
సన్రోన్పల్లి రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డా. రాజేశ్వరి, రైతులు భూమి స్థితి, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి విత్తనాలను ఎంచుకోవాలని, విత్తన శుద్ధి ద్వారా తెగుళ్లను నియంత్రించవచ్చని తెలిపారు. ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటి జీవ శిలీంద్ర నాశినులు, వేప ఆధారిత ఉత్పత్తుల వాడకంపై అవగాహన కల్పించారు.
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని డా. రాజేశ్వరి వివరించారు. మరో శాస్త్రవేత్త డా. ఆలీబాబా వ్యవసాయ ఆర్థిక సంస్కరణలపై చర్చించారు. చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్, పంట మార్పిడి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వరి తర్వాత పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేయడం వల్ల భూసారం పెరిగి, చీడపీడల ఉధృతి తగ్గుతుందని సూచించారు.
భవిష్యత్తులో వరి దొడ్డు రకాలకు మార్కెటింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, రైతులు వానాకాలంలో సన్న రకాలను, యాసంగిలో వరి కాకుండా ఇతర పంటలను సాగు చేయాలని ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్ మై, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, సారంగపల్లి సర్పంచ్ బచ్చలి రాములు, పలువురు రైతులు పాల్గొన్నారు.











