మంచిర్యాల పట్టణంలోని అడ్డా కార్మికులకు ప్రత్యేక స్థలం కేటాయించి షెడ్లు నిర్మించడం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర స్థాయిలో సహకరించాలని హింద్ మజ్దూర్ సభ () మంచిర్యాల జిల్లా కమిటీ గౌరవ ఎంపీకి వినతిపత్రం సమర్పించింది. రోడ్ల పక్కన నిలబడి పనుల కోసం వేచి చూస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరింది.
మంచిర్యాల పట్టణంలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు ప్రతిరోజూ ఉపాధి కోసం ఓవర్ బ్రిడ్జి ఏరియా, ముక్రం చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్ల పక్కన నిలబడి పనుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
కార్మికులకు ప్రత్యేకంగా అడ్డా స్థలం లేకపోవడంతో ఎండ, వర్షం, ట్రాఫిక్, ప్రమాదాల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో రోడ్ల పక్కన గుమిగూడటం వల్ల కార్మికుల భద్రతతో పాటు ప్రజలకు, వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి.
రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే ఈ కార్మికులకు ఒక సురక్షితమైన, గౌరవప్రదమైన కార్మిక అడ్డా ఏర్పాటు చేయడం అత్యవసరం. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసి పరిష్కరించేందుకు గౌరవ ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాము.
ప్రధాన డిమాండ్లు
ప్రధాన డిమాండ్లలో భాగంగా, మంచిర్యాల పట్టణంలో అడ్డా కార్మికుల కోసం శాశ్వత ప్రత్యేక స్థలాన్ని కేటాయించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని, ఆ స్థలంలో ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించే షెడ్లు నిర్మించాలని, కార్మికుల కోసం స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, మహిళా, పురుష కార్మికుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ దీపాలు, కూర్చునేందుకు బెంచీలు, ఫ్యాన్లు తదితర కనీస మౌలిక వసతులు కల్పించాలని, అడ్డా ప్రాంతంలో కార్మికుల భద్రత, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తగిన పార్కింగ్/ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అడ్డా కార్మికులను ఈ-శ్రమ, కార్మిక సంక్షేమ బోర్డులు, కేంద్ర ప్రభుత్వ అసంఘటిత కార్మిక సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక కార్మిక నమోదు శిబిరాలు నిర్వహించాలని, ఈ సమస్యపై సంబంధిత కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖలు, జిల్లా యంత్రాంగం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
కావున, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా మంచిర్యాల అడ్డా కార్మికుల సమస్యను ప్రత్యేకంగా పరిగణించి, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన నిధులు, ప్రభుత్వ సహకారం సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.
అడ్డా కార్మికులకు కేవలం స్థలం కాదు, గౌరవంగా నిలబడి ఉపాధి పొందే హక్కు కల్పించాలనే లక్ష్యంతో సంఘం ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువెళ్తోందని నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు.






