బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆయన దేశ ఉప ప్రధానిగా, వివిధ మంత్రి పదవులలో పనిచేస్తూ దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని, అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రజలను సంఘటిత పరుస్తూ పోరాడారని కలెక్టర్ గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
భవిష్యత్ పరిస్థితులను ముందుగానే గ్రహించి, రచనల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.
మహనీయులు ఆచరించిన సన్మార్గాలను అందరూ అనుసరించాలని, భావితరాలకు వారి జీవిత చరిత్రలు తెలిసేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, శ్రీనివాస్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.







