నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుద్ధ విహార్ లో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో 2570వ బుద్ధ జయంతి వేడుకలు శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు.
బౌద్ధ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో, బుద్ధుని విగ్రహానికి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, కొవ్వొత్తులు వెలిగించారు. పంచశీల జెండాలను ఎగురవేసి, బుద్ధవందన, పంచశీల ప్రార్థనలు చేశారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, సమతా సైనిక సౌత్ ఇండియా అధ్యక్షులు దిగంబర్ కాంబ్లే, బహుజన కళా మండలి రాష్ట్ర నాయకులు అంబాటి దామోదర్ వంటి ప్రముఖులు పాల్గొని, బుద్ధుడు, అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
వక్తలు మాట్లాడుతూ, బుద్ధుని శాంతి సందేశం, కోరికలను జయించడం ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందవచ్చని వివరించారు. వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధుని జననం, జ్ఞానోదయం, మహాపరినిర్వాణం జరగడం వలన ఈ పండుగకు ప్రాముఖ్యత ఉందని తెలిపారు. త్రీచరణ, పంచశీల, అష్టాంగ మార్గాలను అనుసరించాలని సూచించారు.
నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్ మునేశ్వర్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు కొంతం మురళీధర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ తో పాటు పలువురు నాయకులు, దమ్మ సేవకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాలతో వేడుకలు ముగిశాయి.











