మండలంలోని ఇందారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న 'ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట' కార్యక్రమం గురువారం ఇందారం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
ర్యాలీ అనంతరం పాఠశాల ఆవరణలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయగా, మండల విద్యాధికారి (ఏంఈఓ) బి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్నారని తెలిపారు.
బడి ఈడు పిల్లలందరినీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ఈ విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు టీసీ, బోనఫైడ్ మరియు ఆన్లైన్ మెమోలను ఎంఈఓ చేతుల మీదుగా పంపిణీ చేసి, వారి పైచదువులకు శుభాకాంక్షలు తెలియజేశారు.










