మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఇటీవల ప్రారంభమైన కాకతీయ ప్రైమరీ స్కూల్ కు సంబంధించిన అనుమతులు, గుర్తింపులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక కార్యదర్శి కామేర దుర్గారాజ్, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణకు విజ్ఞప్తి చేశారు.
క్యాతనపల్లిలో నూతనంగా ప్రారంభమైన కాకతీయ ప్రైమరీ స్కూల్, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అనుమతులు, గుర్తింపులు, భవన భద్రతా ధృవపత్రాలు, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం వంటి అంశాల్లో చట్టబద్ధ అనుమతులు పొందిందా లేదా అన్నది ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దుర్గారాజ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నిర్వహించడం విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యా హక్కు చట్టం (RTE Act) ఉల్లంఘనకు దారితీసే అవకాశం ఉందని, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రకటనలతో అడ్మిషన్లు చేపడుతూ, సరైన గుర్తింపులు లేకుండా స్కూల్ నిర్వహిస్తే అది చట్టరీత్యా తీవ్రమైన అంశమని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో, పాఠశాల ప్రభుత్వ అనుమతుల వివరాలు, గుర్తింపు పత్రాలు, భవన భద్రతా సర్టిఫికేట్లు, ఫైర్ మరియు శానిటేషన్ అనుమతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామక వివరాలపై తక్షణ విచారణ జరిపించాలని, అనుమతులు లేవని తేలితే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఫిర్యాదుపై డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పందించి, విచారణ చేపట్టే అవకాశం ఉంది. విచారణ అనంతరం పాఠశాల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








