మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్టర్ కేర్ కార్యక్రమంలో పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. మేయర్ దర్ని మధుకర్ తో పాటు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు హాజరయ్యారు.
మేయర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత, రక్షణ వారాన్ని మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ లోని పిల్లలకు అవసరమైన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ, బ్యాంక్ ఖాతా, జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలను అందించడం జరిగిందని వివరించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేయర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












