చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీకి చెందిన గని కార్మికుడు నీలాల శ్రీనివాస్, తన వృత్తితో పాటు నాట్యరంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ, జానపద కళలకు కొత్త ఊపిరి పోస్తున్నారు.
బాల్యం నుంచే నాట్యంపై ఆసక్తి కనబరిచిన శ్రీనివాస్, పాఠశాల దశలో ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహంతో తన కళను కొనసాగించారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నాట్యంపై ప్రేమను వీడకుండా ముందుకు సాగారు.
గని కార్మికునిగా వృత్తి నిర్వహిస్తూనే, నాట్య గురువు అంతడుపుల నాగరాజు మార్గదర్శకత్వంలో శ్రీనివాస్ కళారంగంలో ఎన్నో విజయాలు సాధించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజల మన్ననలు పొందారు.
అతని ప్రతిభకు గుర్తింపుగా డాక్టరేట్లు, నంది అవార్డులు, సువర్ణ పథకాలు వంటి ప్రతిష్టాత్మక గౌరవాలు లభించాయి. మారుమూల గ్రామం నుంచి వచ్చిన శ్రీనివాస్, తన కష్టంతోనే ఈ విజయాలను సాధించారు.
"జానపదం నా గుండె చప్పుడు, నా జీవితం నాట్యానికే అంకితం" అని చెప్పే శ్రీనివాస్, నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


