సంగారెడ్డి, 2026-08-25
వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.
మొక్కలను నాటడం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా, వాటిని నిరంతరం సంరక్షించి పెద్దవిగా పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చెట్లు పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని ఆయన పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటుతున్నారని ఆయన చెప్పారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇంటి వద్ద, పరిసరాలలో నాటుకునేలా అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. దీనివల్ల ప్రతి ఇంటి పరిసరాల్లో పచ్చదనం పెంపొందడంతో పాటు పట్టణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
జిల్లాలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని, తద్వారా మొక్కల వివరాలను నమోదు చేసి వాటి సంరక్షణపై పర్యవేక్షణ కొనసాగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ లలితాదేవి, పీసీబీ అధికారి విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ చలపతిరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తహసీల్దార్ జయరాం నాయక్, అటవీ శాఖ అధికారులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












