మంచిర్యాల జిల్లాలో అంటువ్యాధులు, కీటక జనిత వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యలను జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు డాక్టర్ శ్యామ్ జాన్ శుక్రవారం సమీక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్‌తో సమావేశమయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డులు, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.
జిల్లాలో చిన్నారులకు 12 రకాల వ్యాధులు రాకుండా 100 శాతం వ్యాక్సినేషన్, క్షయవ్యాధి నియంత్రణ, బీపీ, మధుమేహం, క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో వివరించారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా నివారణకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. కుక్కకాటు, పాముకాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వైద్య సేవలపై సంతృప్తి
ఆసుపత్రిలో వైద్య సేవలు, వ్యాధుల నిర్ధారణ, రోగుల వివరాల నమోదు, అత్యవసర చికిత్సలపై కేంద్ర పరిశీలకుడు డాక్టర్ శ్యామ్ జాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో నిరంతర పర్యవేక్షణ కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.












