జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బీరంగూడలో పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. లలితా దేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, ధ్రువపత్రాలు లేకపోవడం, కన్సల్టెంట్ వైద్యుల వివరాలు బోర్డులపై లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనల ఉల్లంఘనలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. లలితాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరంగూడలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించిన ఆమె, పరిశుభ్రత లోపాలు, వైద్య గర్భస్రావ సేవలకు సంబంధించిన () ధ్రువపత్రాలు లేకపోవడం, కన్సల్టెంట్ వైద్యుల వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ఈ సందర్భంగా డా.లలితాదేవి మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో నిత్యం పరిశుభ్రత పాటించాలని, ధ్రువపత్రం ఉన్న ఆసుపత్రులు మాత్రమే ఆ సేవలను అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల ముందు కన్సల్టెంట్ వైద్యుల పేర్లు, విద్యార్హతలు, వైద్య మండలి నమోదు సంఖ్యతో కూడిన బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముందుగా నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఆసుపత్రుల లైసెన్సులు సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు.
జీవ వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం పసుపు, ఎరుపు, నీలం, తెలుపు రంగుల సంచుల్లో వేర్వేరుగా సేకరించి, నిర్దేశిత పద్ధతిలో పంపించాలని సూచించారు. చికిత్స ఖర్చుల వివరాలతో కూడిన ధరల పట్టికను రోగులకు కనిపించేలా ప్రదర్శించాలని తెలిపారు. అగ్నిమాపక పరికరాలు, అగ్నిమాపక శాఖ అనుమతి పత్రం, అత్యవసర నిష్క్రమణ మార్గాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డా.రజని, విజయలక్ష్మి పాల్గొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.












