అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపా సమీపంలోని బ్రాండన్ ప్రాంతంలో ఉన్న సిటీబ్యాంక్ కార్యాలయ సముదాయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, కాల్పులు జరిపిన నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 12.11 గంటల సమయంలో కాల్పుల సమాచారం అందడంతో హిల్స్‌బరో కౌంటీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్యాలయ ప్రాంగణంలో సుమారు 3,200 మంది ఉద్యోగులు ఉండగా, వారిని సురక్షితంగా బయటకు తరలించారు. కార్యాలయంలోని భోజనశాల వద్ద సాయుధ భద్రతా సిబ్బంది నిందితుడిని ఎదుర్కొని కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా భావిస్తున్నామని షెరీఫ్ చాడ్ క్రోనిస్టర్ తెలిపారు. కాల్పులకు గల కారణాలు, మృతుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

