దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్న వ్యాపారుల ఆందోళనను విచారిస్తూ, ప్రదర్శనలు జరిగే ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు కూడా ఆదాయం వస్తుందని, ఒక రకంగా అక్కడ ప్రొటెస్ట్ ఎకానమీ నడుస్తుందని వ్యాఖ్యానించింది.
మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన కూడా ధర్మాసనంలో ఉన్నారు.
నిరసనలతో వేల కోట్ల నష్టం
ఢిల్లీలో నిరసనల కారణంగా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయని కిరాణా కమిటీ ఢిల్లీ, ఇతర వ్యాపార సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో దుకాణాలకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొన్నాయి. వ్యాపార సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నిరసనల కారణంగా కనాట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయని, వేలాది మంది అనుబంధ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. రాబోయే రెండు నెలల పాటు ఢిల్లీలో నిరసనలు, ధర్నాలను నిలిపివేయాలని కోరారు.
నిరసనల ప్రాంతాల్లోనూ ఉపాధి
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రెండు హక్కుల మధ్య సమతుల్యత అవసరమని పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కుతో పాటు వ్యాపారం చేసుకునే హక్కును కూడా గౌరవించాలని స్పష్టం చేసింది. కేవలం పెద్ద వాణిజ్య సంస్థలే కాకుండా కూరగాయలు విక్రయించే వారు, తోపుడు బండ్ల వ్యాపారులు, రోజువారీ కూలీలు వంటి చిన్న వ్యాపారుల జీవనోపాధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నిరసనలు జరిగే ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, వీధి విక్రేతలకు ఆదాయ అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించింది.
నిరసనలకు కాలపరిమితి ఉండాలి
ఒక నిరసన బృందం నిరవధికంగా ఒక నిర్దేశిత ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతర సంఘాలు, రైతులు, కార్మికులు, జర్నలిస్టులు కూడా తమ సమస్యలను వెల్లడించేందుకు అదే ప్రదేశాలను వినియోగించుకునే అవకాశం ఉండాలని పేర్కొంది. నిరసనలకు అనుమతులు ఇచ్చేటప్పుడు వాటి వ్యవధి, నిబంధనలు స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఢిల్లీ వ్యాపార సంఘాలు తమకు జరిగిన ఆర్థిక నష్టానికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నిరసనల నిర్వాహకులను కూడా కేసులో ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది.
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తమ సమాధానాలు సమర్పించాలని ధర్మాసనం కోరింది. నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, సామూహిక నిర్బంధాలు, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ ఆంక్షలు, నిఘా వ్యవస్థ వినియోగం వంటి అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది. నిరసన తెలిపే హక్కును పరిరక్షిస్తూనే ప్రజల జీవనోపాధి, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసింది.

