మునిపల్లి, 17 September
సంగారెడ్డి జిల్లా మండలం పెద్దలోడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చికెన్ బిర్యానీ తిన్న 34 మంది విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాల్ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.
సంగారెడ్డి జిల్లా మండలం పెద్దలోడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చికెన్ బిర్యానీ తిన్న పలువురు విద్యార్థులు వాంతులు, అస్వస్థత లక్షణాలతో ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం 34 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుడు వెంకటేశంలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. పాఠశాల సోషల్ అసిస్టెంట్ ఎ.వెంకటేశం బయట నుంచి తెప్పించిన చికెన్ బిర్యానీని విద్యార్థులకు అందించడానికి ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. అనుమతి లభించడంతో గురువారం ఉదయం సుమారు 9.15 గంటలకు విద్యార్థులకు చికెన్ బిర్యానీని వడ్డించారు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ఇద్దరు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో ఈ విషయం పాఠశాల సిబ్బంది దృష్టికి వచ్చింది. అనంతరం ఉపాధ్యాయుడు వెంకటేశంతో పాటు మరికొందరు విద్యార్థుల్లోనూ వాంతులు, అస్వస్థత లక్షణాలు కనిపించాయి.
దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించి, విద్యార్థులను సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన చికిత్స అందించారు. అక్కడి నుంచి మరికొందరు విద్యార్థులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి, డీఈవో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. సంఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అస్వస్థతకు గురైన మొత్తం 34 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

