మంచిర్యాల (అక్షరవేకువ) అక్టోబర్ 12
జిల్లా కలెక్టరేట్ ఎదుట 63 రహదారి మార్పుతో నష్టపోయిన రైతులు ఈరోజు ధర్నా, ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను శాంతియుతంగా తెలియజేయడానికి దీక్ష చేపట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు అనుమతి నిరాకరించారని బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ ఎదుట 63 రహదారి మార్పుతో నష్టపోయిన రైతులు ఈరోజు ధర్నా, ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ, 63 బాధితులైన రైతులు తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి దీక్ష చేపట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు నిరసన దీక్షలు చేపట్టే హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. రైతులు నిరసన తెలియజేయడానికి పోలీసులు అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, బాధిత ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులను కల్పించాలని కోరారు. దీనికి విరుద్ధంగా జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని ఆయన అన్నారు. రహదారి మార్పునకు ప్రధాన బాధ్యత వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, దానిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్న పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ రైతులను పట్టించుకోకపోవడం చూస్తే, వారికి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని అర్థమవుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఢిల్లీ వేదికలపై మాట్లాడే పార్లమెంట్ సభ్యుడు వంశీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజలు తన తండ్రి అలైన్మెంట్ మార్చడం ద్వారా సన్న కారు రైతులందరూ తమ హక్కులను కోల్పోతున్నారని అన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నిస్తూ, గడ్డం వంశీ సమాధానం చెప్పి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రౌన్ ఫీల్డ్ ద్వారా ఎవరికీ నష్టం జరగకుండా, కొంతమంది ఆంధ్ర పెట్టుబడిదారుల కోసం ఈ తెలంగాణ ఎంపీ, నేనే తెలంగాణ కోసం ఢిల్లీలో పోరాటం చేశాను అని చెప్పుకునే వివేక్ వెంకటస్వామి గారు, నియోజకవర్గంలోని తెలంగాణ రైతులను మోసం చేయడం ఎంతవరకు సబబు అని విమర్శించారు. ఓటు చోరీ గురించి మాట్లాడే ఈ నేతలు, మీకు ఓట్లు వేసిన రైతుల జీవితాలను నాశనం చేస్తున్నందుకు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. భూ సేకరణ అధికారులు నిబంధనలు పాటించకుండా, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పాత నోటీసులు ఇచ్చి భూ సేకరణ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామ సభలు నిర్వహించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బ్రౌన్ ఫీల్డ్ రహదారికి ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ, రైతులు నష్టపోతున్నందున ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై జోక్యం చేసుకొని, రైతుల పక్షాన నిలబడి, రైతుల సొమ్మును కాజేసిన దళారుల కుట్రలను చేదించి బహిర్గతం చేయాలని కోరారు. వెంటనే సర్వేలు, భూ సేకరణ ఆపివేసి గ్రీన్ ఫీల్డ్ ను రద్దు చేసి బ్రౌన్ ఫీల్డ్ గా మార్చాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, రాజ్యాంగబద్ధంగా పోరాడే ప్రజలను, రైతుల కుటుంబాలను కలుపుకొని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధిత రైతులకు కూడా మాట్లాడుతూ, మా బతుకులతో చెలగాటమాడుతున్న నాయకులకు పుట్టగతులు ఉండవు. కష్టపడి పనిచేసే మా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే గ్రీన్ ఫీల్డ్ ను రద్దుచేసి, ఎవరికీ నష్టం లేని బ్రౌన్ ఫీల్డ్ ను ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులను ముంచి, ఆంధ్ర పెట్టుబడిదారుల కోసం బైపాస్ రోడ్డు ముసుగులో రోడ్ల అలైన్మెంట్లు మార్చడం ఏమిటని మంత్రి వివేక్ వెంకటస్వామిని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులపై కుట్రలు, కుతంత్రాలు మానుకొని రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులా మధుసూదన్ రావు, రైతులు లెగిశెట్టి రాజమౌళి, సామాజిక వేత్త కొండయ్య, బొలిశెట్టి తిరుపతి, చల్ల వెంకటేశం, ఉస్మాన్ పాష, సాంబార్ అశోక్, కస్తూరి మల్లేష్, పరమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.







