మంచిర్యాల (అక్షరవేకువ) అక్టోబర్ 13
నేషనల్ హైవే 63 బాధితులైన రైతులు జిల్లా కేంద్రంలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రహదారి అలైన్మెంట్ మార్పులో బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నారని, రైతులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
నేషనల్ హైవే 63 బాధితులైన రైతులు ఈరోజు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు అందరూ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. కానీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలు చేసే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలోని నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయం కళ్ళకు కనబడటం లేదని అన్నారు. బడా పెట్టుబడిదారుల కోసం, కొంతమంది దళారీలకు లొంగి, నేషనల్ హైవే అథారిటీ అధికారులను, మంత్రిని తప్పుదారి పట్టించి, మార్పించిన రహదారి అలైన్మెంట్లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రొక్కం ఆడితే గానీ డొక్కాడని (అంటే డబ్బులిస్తేనే పని చేసే) రైతులపై పశుశాస్త్రం ప్రయోగించి, బ్రౌన్ఫీల్డ్ను గ్రీన్ఫీల్డ్గా మార్చి వారి జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు కొంతమంది దళారులతో వివేక్ వెంకటస్వామి చేతులు కలిపారని విమర్శించారు. మేమంతా భారతీయ జనతా పార్టీ తరపున ఒక పార్లమెంట్ సభ్యుడితో ఢిల్లీ వెళ్లి నేషనల్ హైవే అథారిటీ అధికారులను కలవగా, తప్పు జరిగిందని వారు గుర్తించారు. కానీ, మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీలు సిఫార్సు చేస్తే కచ్చితంగా రోడ్డు అలైన్మెంట్ను బ్రౌన్ఫీల్డ్గా మారుస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ రైతుల పక్షాన నిలబడి, వారికి అనుకూలంగా నేషనల్ హైవే అథారిటీకి గానీ, కేంద్ర మంత్రి గట్కరి గారికి గానీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం లేదు. వివేక్ వెంకటస్వామి చేసిన తప్పును సమర్థించేందుకు, పార్లమెంట్ సభ్యుడు రైతులకు మరోసారి అన్యాయం చేసే విధంగా ఆలోచిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడే రాహుల్ గాంధీ పార్టీ సభ్యులు, నియోజకవర్గంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ రైతులను హడలెత్తిస్తున్నందున, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇదే తరహాలో రాజ్యాంగ ప్రజలను పట్టుకొని రాహుల్ గాంధీని తెలంగాణలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తామని హెచ్చరించారు. కాబట్టి, ఆ పరిస్థితి రాకముందే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అదేవిధంగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు అండగా నిలబడి ప్రజల మన్ననలు పొందాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు లగిశెట్టి రాజమౌళి మాట్లాడుతూ, మమ్మల్ని వంచించిన నాయకులను వదిలిపెట్టేది లేదని, మమ్మల్ని మోసం చేసి, ఆంధ్రుల వద్ద సొమ్ములకు మోకరిల్లి, ఢిల్లీలో పైరవీలు చేసి మా జీవితాలతో చెలగాటమాడుతూ బ్రౌన్ఫీల్డ్ను మార్చారని, కచ్చితంగా వారి రాజకీయ భవిష్యత్తును కూడా మేమే మారుస్తామని హెచ్చరించారు. రైతులకు ద్రోహం చేయడమే కాకుండా, కొద్దిమంది దళారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల ముసుగులో ఉండి, మాకు సహకరించే నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ, వారి బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళనతో ఎన్నో రకాలుగా అవమానించారు. మాకు సహకరించే నాయకులను గుండెల్లో పెట్టుకుంటామని ఆక్రోషంతో అన్నారు. ఖచ్చితంగా మాకు ద్రోహం చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల దళారుల బాగోతం, వారి పేర్లు అతి త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా పార్లమెంట్ సభ్యుడు వంశీ రైతుల కు అండగా నిలబడి, వలసవాదులు అభివృద్ధి చెందకుండా, మీకు ఓట్లు వేసి గెలిపించిన రైతులకు అండగా నిలబడి, గ్రీన్ఫీల్డ్లోని రహదారిని బ్రౌన్ఫీల్డ్గా మార్చి రైతుల మన్ననలు పొందాలని కోరారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ రైతుల ద్రోహిగా పిలువబడే పరిస్థితి రాకుండా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు, కర్రే లచ్చన్న, గంధ శ్రీనివాస్, సురేందర్ చారి, రైతు నాయకులు లెగిశెట్టి రాజమౌళి, చెల్లా వెంకటేష్, కస్తూరి మల్లేష్, బొలిశెట్టి తిరుపతి, పరమేష్, మాజీ ఎంపీటీసీ తిరుపతి, దాస్య నాయక్, శంకర్, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






