ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు ఖతార్ ద్వారా కొత్త అణు ప్రతిపాదనను పంపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అయితే, అమెరికాతో చర్చలు ప్రారంభించాలంటే ముందుగా తమ ఏడు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నట్లు ఒక సీనియర్ ఇరాన్ అధికారి తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనలోని పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇరాన్ విధించిన డిమాండ్లలో ప్రధానంగా అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించడం వంటివి ఉన్నాయి.
ఈ డిమాండ్లను అమెరికా అమలు చేసే వరకు చర్చలకు ముందుకు రాబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని కూడా తిరిగి తెరవబోమని హెచ్చరించింది.
రష్యా పర్యటనలో ఉన్న ఇరాన్ భద్రతా వ్యవహారాల ఉన్నతాధికారి మొహసేన్ రెజాయీ ఈ విషయంపై స్పందించారు. దౌత్యపరమైన చర్చలకు సంబంధించి ఇప్పటికే అమెరికాకు ఏడు షరతులు తెలియజేశామని ఆయన చెప్పారు. వాటిని అమలు చేసిన తర్వాతే చర్చలు, హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలపై ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా చర్చల్లో ప్రధాన అంశంగా చేర్చాలని పట్టుబడుతోంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసే అవకాశాన్ని పూర్తిగా నిరోధించాలన్నది వాషింగ్టన్ ప్రధాన లక్ష్యం. అయితే, తమపై విధించిన ఆంక్షలు, ఆర్థిక ఆంక్షల వల్ల ఏర్పడిన సమస్యలను ముందుగా పరిష్కరించాలని టెహ్రాన్ కోరుతోంది. ఇరుపక్షాల మధ్య ఇదే ప్రధాన విభేదంగా మారింది.
ఈ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య నేరుగా చర్చలు జరగకపోయినా, ఖతార్ ద్వారా ఇరుపక్షాలు ప్రతిపాదనలు, సందేశాలను పరస్పరం పంపించుకుంటున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గతంలో ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల ప్రణాళికను మరింత వేగంగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి. ఆ ప్రణాళికలో ప్రాంతీయంగా యుద్ధాన్ని నిలిపివేయడం, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఏడో రోజు హోర్ముజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే మరింత విస్తృతంగా ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. అనంతరం, ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలపై దాడులు చేసింది. లెబనాన్‌లో హిజ్బొల్లా, యెమెన్‌లో హౌతీలకు సంబంధించిన ఘర్షణలు కూడా ఈ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

