దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు ఆయుధాగారం, మోటార్ వెహికల్ సెక్షన్లలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలో విధులు నిర్వహించేందుకు ఉపయోగించే ఆయుధాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
జిల్లా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఆయుధాలు పోలీసు విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్.ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, టౌన్ సీఐ రాము నాయుడు, పోలీసు అధికారులు, ఆయుధాగార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












