బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఈ నెల 22వ తేదీ గురువారం ఉదయం 11:30 గంటలకు బీసీ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు.
బీసీలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటడంతో పాటు, బీసీల హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నరెడ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల నేపథ్యంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కులగణన, రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటా, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై బీసీలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి ఉద్యోగులు, మేధావులు, మహిళా నాయకులు, యువతీ యువకులు, విద్యార్థులు, వృత్తి సంఘాల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ కుల సంఘం నాయకుడు, ప్రతి బీసీ ఉద్యోగి, ప్రతి బీసీ యువతీ యువకుడు, ప్రతి బీసీ విద్యార్థి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై బీసీల ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు.
బీసీల హక్కుల సాధన కోసం బీసీలంతా సంఘటితంగా ముందుకు రావాలని, బీసీ రాజ్యాధికార సాధన దిశగా ఐక్యంగా ఉద్యమించాలని నరెడ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీసీల ఐక్యతే మన బలం.. బీసీల ఆత్మగౌరవమే మన స్ఫూర్తి.. బీసీ రాజ్యాధికారమే మన లక్ష్యం అని ఆయన ఉద్ఘాటించారు.
కావున జిల్లా బీసీలందరూ తరలివచ్చి బీసీ అలై బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ణకంటి రవీందర్, బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్, బీసీ సమాజ్ జిల్లా కార్యదర్శి బియ్యాల సత్తయ్య, బీసీ సమాజ్ ్ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షఫీ, బీసీ సమాజ్ ్ సిటీ ఉపాధ్యక్షుడు ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.






