ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యేందుకు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ నవంబరు 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల బస్సును పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.












