రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తెచ్చిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఖండించారు. మంచిర్యాల ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో భూతాపం పెరిగి కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు లేవని, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో తాగునీటికి సరిపడా నీరు ఉందని తెలిపారు. నీటి లభ్యత దృష్ట్యా రైతులు రెండో పంట సాగు చేయవద్దని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు.
కడెం డిస్ట్రిబ్యూటరీ కాలువలకు పగుళ్లు ఏర్పడటంతో 42వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీరు చేరడం లేదని తెలిపారు. సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్య, ఆదాయపు పన్ను, డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు.
మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట అని, తాజా సర్వేలో పార్టీతో పాటు తనకు ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందని పేర్కొన్నారు. ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.












