మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 48వ డివిజన్లో పార్కు కోసం కేటాయించిన 400 గజాల స్థలంలో జరిగిన ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం తొలగించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. అన్వేష్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
పార్కు కోసం కేటాయించిన స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నాయని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. టీపీఓ సంపత్, టీపీఎస్ శ్యామ్ రాజ్ కుమార్ నేతృత్వంలోని బృందం జేసీబీ సహాయంతో ఆక్రమణలను తొలగించింది.
పాత మాస్టర్ ప్లాన్లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
మంచిర్యాల నగరంలో అక్రమ భూ ఆక్రమణలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ జి. అన్వేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.












