మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ పాఠశాల క్రీడా మైదానంలో సీవీ రామన్ డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ఈ పోటీలను ఘనంగా ప్రారంభించారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేయర్ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు.
క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని మేయర్ దర్ని మధుకర్ పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచిర్యాల జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
క్రీడారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలని మేయర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంగవరపు వెంకటేశ్వర్లు, తాళ్ల సంపత్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు రమణ, సీవీ రామన్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.












