ఖరీఫ్ సీజన్లో కరువుతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు పంట రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని జిల్లా అధికారులు బ్యాంకులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలను పునరుద్ధరించి, రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అర్హులైన రైతుల పంట రుణాల పునర్వ్యవస్థీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ ఏఓ విజయలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ టి.సుధీర్ కుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్2026 కరువు సహాయక చర్యల్లో భాగంగా ప్రత్యేక డీసీసీ/డీఎల్ఆర్ఎల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతుల వ్యవసాయ పంట రుణాల పునర్వ్యవస్థీకరణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ ఏఓ విజయలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ టి. సుధీర్ కుమార్, ఆర్బీఐ ఎల్డీఓ వి.ప్రదీప్ చంద్ర, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, వ్యవసాయ శాఖ అదనపు డీఏ బి. శ్రీదేవి, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. కరువు ప్రభావిత మండలాల్లోని అర్హులైన రైతుల పంట రుణాలను నిబంధనల ప్రకారం పునర్వ్యవస్థీకరించడం, రుణాల తిరిగి చెల్లింపు గడువును పొడిగించడం, తాత్కాలిక వాయిదా సదుపాయం కల్పించే అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏఓ విజయలక్ష్మి మాట్లాడుతూ భారతీయ రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు, సంబంధిత బ్యాంకుల పాలక మండళ్లు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా అర్హులైన రైతులకు సహాయక చర్యలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. పంట రుణాల పునర్వ్యవస్థీకరణకు అవసరమైన రైతుల వివరాలను సక్రమంగా సేకరించి, భద్రపరిచి, నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ టి. సుధీర్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి 26 వరకు రెండు త్రైమాసికాల్లో జిల్లాలోని బ్యాంకులు మొత్తం 1,20,065 ఖాతాల ద్వారా రూ.2,520.18 కోట్ల పంట రుణాలను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని మొత్తం 28 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించగా, వాటిలో 2 మండలాలు తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా, 26 మండలాలు మోస్తరు కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించినట్లు వివరించారు. పంట రుణాల పునర్వ్యవస్థీకరణ మాత్రమే ఈ ప్రక్రియలో భాగమని, దీనిని రుణమాఫీ పథకంగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ వి.ప్రదీప్ చంద్ర, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, వ్యవసాయ శాఖ అదనపు డీఏ బి.శ్రీదేవి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








