చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం పథకాలకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం పథకాలకు నిధులు విడుదల చేసి, అర్హులైన వారికి పింఛన్లతో పాటు స్వయం ఉపాధి రుణాలు అందించాలని ప్రభుగౌడ్ కోరారు. ఈ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయన అన్నారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేపట్టి పోరాటం చేస్తామని ప్రభుగౌడ్ హెచ్చరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలు తప్పవని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంఘం అధ్యక్షుడు పట్టోళ్ల మల్లికార్జున పాటిల్, ఉపాధ్యక్షుడు డి.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శులు పార్వతి, కృష్ణ, నాగరాణి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.అంజనేయులు, ప్రధాన కార్యదర్శి జే.రాజేశ్వర్ స్వామి, కోశాధికారి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీధర్, మహేంద్ర, ముఖ్య సలహాదారు కరంజిత్ సింగ్, కార్యదర్శులు గౌలీశ్వర్, శ్రీనివాస్, ప్రవీణ్, మహేష్, సభ్యులు యాదగిరి, రవీందర్, యూత్ కమిటీ అధ్యక్షుడు జావిద్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజుల గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మానస, కార్యదర్శి వీరమణి, మండల అధ్యక్షురాలు మౌనిక తదితరులు పాల్గొన్నారు.












