సంగారెడ్డి, 16 November
బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు. బాలల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. నా రోజు, నా హక్కులు, నా భవిష్యత్తు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారితో కలిసి బాలల నుంచి 50 అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన బాలలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని, అదనపు తరగతి గదులు నిర్మించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రహరీ గోడలు నిర్మించాలని, మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించాలని కోరుతూ బాలలు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించడం, వారి హక్కులను పరిరక్షించడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపడమే బాలల ప్రత్యేక ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బాలలకు విద్య, వైద్యం, రక్షణతో పాటు సమాన అవకాశాలు కల్పించేలా సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. బాలల అభిప్రాయాలకు, సమస్యలకు తగిన ప్రాధాన్యతనిస్తూ వారి అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. బాలలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, లింగం, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


