ఉద్యోగం లేదంటూ భరణం చెల్లించలేనని వాదించిన ఓ వ్యక్తికి ఒడిశా హైకోర్టు షాకిచ్చింది. కారు ఈఎంఐ చెల్లిస్తూ, భార్యకు మాత్రం భరణం ఇవ్వలేనని చెప్పడం సరికాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో భార్యకు శాశ్వత భరణంగా రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఒడిశా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేదని, తండ్రి పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్నానని చెప్పిన ఓ వ్యక్తి వాదనలను కోర్టు పూర్తిగా విశ్వసించలేదు. గతంలో అతను ఓ బీమా సంస్థలో పనిచేస్తూ నెలకు సుమారు రూ.30 వేల జీతం పొందేవాడని కోర్టు గుర్తించింది. 2020లో న్యాయవాద వృత్తిలోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగం లేకపోయినా, బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన కారుకు నెలకు రూ.10 వేల ఈఎంఐ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న విషయాన్ని కోర్టు గుర్తించింది. భార్యకు భరణం చెల్లించలేనని చెబుతూనే, కారు వాయిదాలు చెల్లించడంపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. భార్యకు సొంత ఆదాయం లేదని, ఆమె తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తోందని పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో, భార్యకు శాశ్వత భరణంగా రూ.10 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. మూడు నెలల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.5 లక్షలు కోర్టు రిజిస్ట్రార్ వద్ద జమ చేసి ఉంటే, మిగిలిన రూ.5 లక్షలు చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీశ్ టాండన్, జస్టిస్ చిత్రరంజన్ దాస్లతో కూడిన ధర్మాసనం వెలువరించింది.

