దేశంలో బీమా పాలసీలు కొనుగోలు చేసే వినియోగదారులకు ఖర్చు తగ్గే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా పంపిణీ విధానంలో పలు మార్పులను ప్రతిపాదించింది. కమిషన్లు, బీమా సంస్థల నిర్వహణ ఖర్చులు, రుణాలతో బీమాను తప్పనిసరిగా కలిపి విక్రయించడం, తప్పుదారి పట్టించే విక్రయాలను నియంత్రించడం వంటి అంశాలపై కొత్త ప్రతిపాదనలు చేసింది.
అయితే, ఇవి ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాతే వినియోగదారులపై వాస్తవ ప్రభావం స్పష్టమవుతుంది.
1. కమిషన్లపై పరిమితులు
బీమా పాలసీల విక్రయానికి ఏజెంట్లు, బ్యాంకులు, బ్రోకర్లకు చెల్లించే కమిషన్లపై ఉత్పత్తి స్థాయిలో పరిమితులు విధించాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. పాలసీ రకం, పంపిణీ మార్గం, పాలసీ విలువ, విక్రయానికి అవసరమైన సేవలను బట్టి కమిషన్లు మారే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలకు సంబంధించిన థర్డ్‌పార్టీ మోటార్ బీమాపై కమిషన్ లేకుండా చేసే ప్రతిపాదన కూడా ఉంది.
2. రుణంతో బీమాను బలవంతంగా కలపకూడదు
బ్యాంకులు రుణం ఇచ్చే సమయంలో బీమా పాలసీని తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని తగ్గించేలా కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. రుణంపై తక్కువ వడ్డీ రేటు కోసం బీమా తీసుకోవాలని బ్యాంకు సూచించినా, వినియోగదారుడు తనకు నచ్చిన బీమా సంస్థను ఎంచుకునే అవకాశం ఉండేలా ప్రతిపాదన ఉంది.
3. బీమా సంస్థల ఖర్చులకు పరిమితులు
బీమా సంస్థలు నిర్వహణ, పంపిణీ తదితర అంశాలపై చేసే ఖర్చులను దశలవారీగా తగ్గించే ప్రతిపాదన ఉంది. జీవిత బీమా సంస్థలకు నిర్వహణ ఖర్చుల పరిమితిని రెండేళ్లలో 15 శాతానికి, ఐదేళ్లలో 12.5 శాతానికి తీసుకురావాలని ప్రతిపాదించారు. సాధారణ బీమా సంస్థలకు కూడా పరిమితులను క్రమంగా తగ్గించే ప్రతిపాదన ఉంది.
బీమా విక్రయాల్లో అధిక ప్రోత్సాహకాలు, లక్ష్య ఆధారిత ప్రయోజనాలు వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు ప్రతిపాదించారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఉద్యోగులకు బీమా విక్రయాల పరిమాణం ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలపై కూడా ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పాలసీ ఎంపిక జరిగేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీమా కొనుగోలు, పోలిక, సేవలు, పాలసీ నిర్వహణను సులభతరం చేసేందుకు డిజిటల్ వ్యవస్థలను మరింత విస్తరించాలని ప్రతిపాదించారు. బీమా సుగమ్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు, పారదర్శకత అందించాలనే లక్ష్యం ఉంది.
అయితే, కమిషన్లు తగ్గినంత మాత్రాన బీమా ప్రీమియం తప్పనిసరిగా తగ్గుతుందని చెప్పలేం. బీమా సంస్థలు ఖర్చుల్లో వచ్చే పొదుపును ఎంతవరకు వినియోగదారులకు బదిలీ చేస్తాయన్నదే కీలకం. మరోవైపు, చిన్న మొత్తాల పాలసీల విక్రయానికి ఏజెంట్లకు ప్రోత్సాహం తగ్గితే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బీమా అందుబాటుపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఐఆర్డీఏఐ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. తుది నిబంధనలు వెలువడిన తర్వాతే ప్రీమియాలు, పాలసీ విక్రయ విధానం, వినియోగదారుల ప్రయోజనాలపై పూర్తి ప్రభావం తెలుస్తుంది.






