రామ రాజ్యం స్థాపన దిశగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు సాగుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుజనులు, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేరుతున్నాయని, ప్రజల సంతోషమే ప్రధానమంత్రికి ఆనందమని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ, 12 ఏళ్ల అంత్యోదయ సిద్ధాంతంతో బీజేపీ ముందుకు సాగుతోందని, 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చరిత్ర సృష్టించిందని రఘునాథరావు తెలిపారు. పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని కమల శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ దూరదృష్టి కలిగిన నాయకుడని, జాతీయ రహదారుల ఆధునీకరణ, ఆధునిక రైల్వే స్టేషన్ల నిర్మాణం వంటివి దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. 47 ఏళ్ల చరిత్రలో దేశ ప్రజల మనసులను గెలుచుకున్న పార్టీ బీజేపీ అని, కేవలం 2 ఎంపీలతో ప్రారంభమైన పార్టీ మూడుసార్లు అధికారంలోకి రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
గత 12 ఏళ్ల పాలనలో అంత్యోదయ, అభివృద్ధి, సంక్షేమ దిశగా బడుగు, బలహీన, బహుజన, గిరిజన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, తద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నారని రఘునాథరావు తెలిపారు. త్వరలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచ రికార్డు సృష్టిస్తోందని ఆయన అన్నారు.
దేశంలో రాబోయే రోజుల్లో ఉన్నత ఫలితాలు సాధిస్తుందని, రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడానికి బీజేపీ ముందుకు సాగుతుందని రఘునాథరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, స్టేట్ మీడియా ప్రతినిధి తుల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.












