క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సోమవారం రామకృష్ణాపూర్లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావడంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మండల కేంద్రం రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో క్రియాశీల కమిటీలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు జరిగేలా చూడాలని వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. దీని కోసం ప్రతి బూత్‌లో బిఎల్ఎ లను నియమించాలని సూచించారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, మంజూరైన నిధులను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వార్డుల్లోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సమస్యలను గుర్తించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని తెలిపారు.
ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి ప్రతి వార్డులో సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











