లక్షెట్టిపేట (అక్షరవేకువ) నవంబర్ 27
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన లక్షెట్టిపేట మండలం అంకతిపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం అంకతిపల్లి గ్రామంలో జై హనుమాన్ గ్రామ సంఘం, ఇటిక్యాల గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తూకం, రికార్డుల నిర్వహణ, గన్నీ బ్యాగుల లభ్యత వంటి అంశాలను పకడ్బందీగా చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని తెలిపారు. ధాన్యం గ్రేడ్ ఏ రకానికి 2,461 రూపాయలు, సాధారణ రకానికి 2,441 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగిందని, సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.
మండలంలోని లింగాపూర్‌లో గల శ్రీకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించి మిల్లులో ధాన్యం నిల్వలు, బియ్యం నాణ్యత, మిల్లింగ్ ప్రక్రియ, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. దండేపల్లి మండల కేంద్రంలోని రైస్ మిల్లును మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, జన్నారం మండలం మోర్రిగూడలోని రాఘవేంద్ర, రాజరాజేశ్వరి రైస్ మిల్లులను సందర్శించి, ధాన్యం నిల్వ సామర్థ్యం, రికార్డులను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. కర్ణపేటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థినులకు కల్పిస్తున్న వసతి, భోజనం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని సౌకర్యాలు సక్రమంగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు జిల్లా విద్యారంగంలో ముందంజలో ఉండేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.


