మంచిర్యాల జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపికైన అర్హులకు ఇళ్లు కేటాయించాలని ఆయన కోరారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మార్చి 17, 2023న పద్మావతి గార్డెన్స్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లాటరీ నిర్వహించబడిందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా 330 మంది అర్హులైన పేదలను ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. అప్పటి కలెక్టర్, అధికారులు, మీడియా సమక్షంలో ఈ లక్కీ డ్రా జరిగిందని ఆయన వివరించారు.
తాను, ఇతర ప్రజాప్రతినిధులు లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొనలేదని, లబ్ధిదారులను మినహా ఎవరినీ ప్రాంగణంలోకి అనుమతించవద్దని అప్పటి కలెక్టర్‌కు సూచించినట్లు దివాకర్ రావు తెలిపారు. రెండున్నర సంవత్సరాలుగా ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇటీవల మీడియా ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, ప్రస్తుత మంచిర్యాల శాసనసభ్యులు మళ్లీ కొత్తగా లాటరీ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారని, ఇది అప్పట్లో ఎంపికైన అర్హులకు అన్యాయం చేయడమే అవుతుందని ఆయన ఆరోపించారు. అప్పటి లాటరీలో ఎంపికైన వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, TBGKS, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, BRS కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












