మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
40 కిలోల సంచికి అదనంగా 3 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని, మిల్లర్లతో ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారని దివాకర్ రావు ఆరోపించారు. లక్షెట్టిపేటలో నలుగురు రైతులు మృతి చెందినప్పటికీ కలెక్టర్ స్పందించడం లేదని, రైతు బీమా కింద రూ. 5 లక్షలు అందాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చేది సున్నా అని విమర్శించారు.
నెల రోజులుగా కల్లాలోనే ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేరని, దండేపల్లి, లక్సెట్టిపేట్, హాజీపూర్ రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. బడాయి మాటలతో మంచిర్యాలలో భయపెడుతున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ఆయన ధ్వజమెత్తారు.
ఒక అసెంబ్లీలో కూల్చివేతలకు నష్టపరిహారం చెల్లిస్తుంటే, ఇక్కడ ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఇది నియంత రాజ్యమా అని ఆయన నిలదీశారు. గతంలో తన నియోజకవర్గంలో 2 కిమీ పైపు పగిలితే, సంబంధిత కంపెనీ ద్వారానే రీప్లేస్ చేయించానని గుర్తు చేశారు.
ప్రస్తుతం 500 కోట్ల రూపాయలను దండుపాళ్యం ముఠాలు దోచుకుంటున్నాయని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.











