గోదావరిఖనిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల యువ కార్మికుడు కుంభం రాజు మరణించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుంభం రాజు తన స్నేహితులను కలవడానికి ద్విచక్ర వాహనంపై గోదావరిఖని వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో, మేకల వ్యాను ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న రాజును పోలీసులు గుర్తించి, మందమర్రిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అతన్ని కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.
మృతుడు కాసిపేట గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల తోటి ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.












