ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన సభను సోమవారం నిర్వహించారు. గ్రామంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల్లో జాగ్రత్తలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గౌరవ సర్పంచ్ మహమ్మద్ ఫయాజొద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ, గ్రామ కార్యదర్శి ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్డు సభ్యులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్, గ్రామ యువకులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడం, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో గ్రామస్థుల సమక్షంలో రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గ్రామంలో రోడ్డు భద్రతపై పర్యవేక్షణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.











