ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, ఎదురవుతున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హిమాయత్ నగర్లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో, ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడం, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన మంజూరు చేయడం, భూ సమస్యల పరిష్కారం, పరిపాలనపరమైన అడ్డంకులను తొలగించడం, క్షేత్రస్థాయిలో అమలు తీరు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. పనులు ఆలస్యం కాకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రివర్యులు ఆదేశించారు.
సమీక్షలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు, పాయల శంకర్, రామారావు పటేల్, ప్రేమసాగర్ రావు, పాల్వాయి హరీశ్ బాబు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా సమగ్ర కార్యాచరణ అవసరమని సూచించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. పథకం అమలులో పారదర్శకత, వేగం పాటించాలని సూచనలు వెలువడ్డాయి.










