తెలంగాణకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శ్రీరామరక్షగా నిలుస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి పదేళ్లు పాలించి చూపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మంచిర్యాలలో 'అక్షరవేకువ'తో మాట్లాడుతూ, సీఎం పాలన తుగ్లక్ చేష్టలను తలపిస్తోందని, చరిత్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని కేటీఆర్ విమర్శించారు. సింగరేణిలో సీఎం బావమరిది సృజన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని, సైట్ విజిట్ పేరుతో కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అండగా ఉంటూ తెలంగాణను దోచుకుంటున్నాయని, సింగరేణి కార్మిక సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అమృత పథకంలోనూ కాంగ్రెస్ వాటాలు దండుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలలోనూ సీఎం బావమరిది అక్రమార్జన ఏంటని ఆయన ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణ రక్షణ, నియామకాలు, ఉద్యోగాలు, సమస్యల పరిష్కారంలో కొంతమేరకు సఫలీకృతమైనా, కొన్ని సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో పార్టీ యాక్షన్ ప్లాన్ను క్షేత్రస్థాయికి పరిమితం చేసి, జిల్లా, మండల, పట్టణ అధ్యక్షులతో మాట్లాడుతూ ప్రతి సమాచారాన్ని సేకరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రక్షణకు, ప్రజలకు అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని జోష్యం చెప్పారు.








