మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. రామచందర్ రావుతో హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చర్చించారు.
మాజీ జిల్లా అధ్యక్షులు బుస నరసింహ రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో, మంచిర్యాల కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల లోటుపాట్లపై ఆయన ఆరా తీశారు.
మంచిర్యాల జిల్లాలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ ప్రాంతంపై రాష్ట్ర పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని రామచందర్ రావు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, తద్వారా ఎన్నికలలో విజయాలు సాధించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని, పార్టీ నియమాలను పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. త్వరలోనే మంచిర్యాల పర్యటనకు వస్తానని, స్థానిక నాయకులకు సూచనలు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు రామచందర్ రావును శాలువాతో సన్మానించారు.
ఈ సమావేశంలో మున్నా రాజా సిసోడియ, కాశెట్టి నాగేశ్వరరావు, తుల మధుసూదన్ రావు, బొలిశెట్టి తిరుపతి వంటి పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.











