మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్, శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ వద్ద నివాసాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్యపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు మేయర్ ధర్ని మధుకర్ స్పందించి, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ సమీపంలో నివాసాల పై నుండి వెళ్తున్న ఎల్.టి. లైన్ల వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ దృష్టికి తీసుకువచ్చారు.
మేయర్ మధుకర్ సంఘటనా స్థలానికి వెళ్లి నివాసాలను పరిశీలించి, సమస్యను అర్థం చేసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE)తో ఫోన్ ద్వారా సంప్రదించి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
మేయర్ ఆదేశాలతో విద్యుత్ లైన్ల మార్పునకు చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చర్యల వలన స్థానిక నివాసితులు భద్రతతో పాటు, విద్యుత్ సంబంధిత ప్రమాదాల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తున్నారు.
సమస్య పరిష్కారానికి మేయర్ చూపిన చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మేయర్ ధర్ని మధుకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్, ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.











