భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మందమర్రి ఏరియాలోని సింగరేణి గ్రీన్ పార్క్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి శ్రీ జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా, మంత్రి జి. వివేక్ వెంకటస్వామి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన, కేక్ కటింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా, సీనియర్ హిందీ పండిట్ శ్రీ జామి ప్రసాద్ రావు రచించిన పుస్తకం, మరియు డి.జి.ఎం (IE) శ్రీ కె. కిరణ్ కుమార్ సంగీతం అందించిన 'అంబేద్కర్ థీమ్ సాంగ్' ఆవిష్కరించబడ్డాయి. కమ్యూనికేషన్ సెల్ బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మంత్రి శ్రీ జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కీలకమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొత్త బొగ్గు గనుల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణ, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, సింగరేణి అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గుర్తింపు యూనియన్ AITUC ప్రతినిధి శ్రీ శైలేంద్ర సత్యనారాయణ కార్మికుల హక్కుల రక్షణ తమ ధ్యేయమని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఏ. భాస్కర్ ఐపీఎస్ కూడా హాజరయ్యారు. పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.












