వేడుకలు (అక్షరవేకువ) నవంబర్ 26
జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి, ప్రతిజ్ఞ చేశారు.
జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్పాండే, ఎస్.సి. అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, వయోజన విద్య అధికారి పురుషోత్తం నాయక్ హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి, రాజ్యాంగం పట్ల తమ నిబద్ధతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిలబెట్టే రాజ్యాంగ మౌలిక సూత్రాలను గౌరవిస్తూ, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను గౌరవించాలని, కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు విధులు, బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని, ప్రభుత్వ సేవలలో ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, న్యాయ సూత్రాలను పాటించాలని సూచించారు.

