విశాఖపట్నంలో ప్రతిపాదిత అధానీ గూగుల్ AI డేటా సెంటర్ ప్రాజెక్టుపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలకు, ముఖ్యంగా దళితులకు, పేదలకు ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
భారీ భూమి పూజలు, ప్రచారాల మధ్య ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్టుపై స్థానిక ప్రజల నుంచి, ముఖ్యంగా దళితుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల భూములను తక్కువ ధరలకు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇది అన్యాయమని ఆయన విమర్శించారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దేశీయ యువత, చిన్న పరిశ్రమలకు అవకాశాలు కల్పించడమేనని, కానీ విదేశీ లేదా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. దేశంలో నిరుద్యోగం, కార్మికుల ఇబ్బందులు వంటి సమస్యలు ఉన్నప్పటికీ, వేల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
గూగుల్ AI డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో నీటి కొరత, కాలుష్యం, విద్యుత్ వినియోగ భారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వంశీకృష్ణ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తిన ఉదాహరణలు ఉన్నాయని, విశాఖపట్నంలో అలాంటి పరిస్థితి రాకుండా సమగ్ర సమీక్ష జరపాలని ఆయన కోరారు.
అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, హక్కులు కోల్పోయే పరిస్థితి రాకూడదని, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దళితులు, పేదలు, రైతుల హక్కులను కాపాడే విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ప్రజా హక్కుల పరిరక్షణ కోసం తాను నిరంతరం పోరాడుతానని ఆయన హామీ ఇచ్చారు.










