తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ మరియు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాల మేరకు, ముదిరాజ్ మహాసభ నాయకులు కొందరు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ 2014లో ముదిరాజ్ మహాసభను స్థాపించినప్పటి నుండి, గత 40 సంవత్సరాలుగా ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్సీగా రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ నిధుల ద్వారా ముదిరాజ్ భవనాలు, కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలను కేటాయించారని పేర్కొన్నారు. కోకాపేటలో ఆత్మగౌరవ భవనాల కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థలం కోసం వినతి పత్రం సమర్పించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి జీవో ఎంఎస్ నెంబర్ 04 ద్వారా స్థలం, 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు.
డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ రాజకీయ జీవితం ప్రారంభం నుండి ముదిరాజుల అభివృద్ధికి తపన పడుతున్నారని, అనాటి దేవాలయాల నిర్మాతలు, పోరాటయోధులు, మరియు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ వంటి చారిత్రక వ్యక్తుల చరిత్రలను వెలికితీసి యువతరానికి అందించారని నాయకులు తెలిపారు. జూబ్లీ బస్టాండ్ ప్రాంగణంలో కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని సేకరించి, విగ్రహ నిర్మాణాన్ని చేపట్టారని పేర్కొన్నారు.
గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2000 ఉన్న మత్స్య సహకార సంఘాలను, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక డాక్టర్ బండా ప్రకాష్ గారి నాయకత్వంలో 6,200 సంఘాలుగా విస్తరించారని తెలిపారు. నిరుపేద ముదిరాజ్ మత్స్యకారులకు TVS మోపెడ్, TATA Ace, Bolero వాహనాలు, వలలు, పడవలు వంటివి ఇప్పించారని, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి LOCలు, CMRFల ద్వారా ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు.
ముదిరాజుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారిపై సోషల్ మీడియాలో వస్తున్న నిందారోపణలు, సంస్కారం లేని ఆరోపణలు సమంజసం కాదని నాయకులు అన్నారు. ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కేటాయించిన భూమి నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ఈ భూమి రిజిస్ట్రేషన్లు నిషేధించబడ్డాయని, దీనిని వాణిజ్య ప్రయోజనాలకు, ఇతరులకు అద్దెకు ఇవ్వడం నిషేధమని స్పష్టం చేశారు. ట్రస్టీలు కేవలం సంరక్షకులే తప్ప, భూమి వారి వ్యక్తిగత ఆస్తి కాదని, కావున అసత్య ఆరోపణలను నమ్మవద్దని ఖండించారు.








