వర్షాకాలంలో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులతో సమావేశమయ్యారు.
జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో, కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే, వారి సహాయార్థం ఎన్డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించాలని సూచించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలను కల్పించే బాధ్యతను జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. వర్షాకాలం మొత్తం అప్రమత్తతతో ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్ఓ రమేష్ రాథోడ్, ఆర్డిఓ దేవిదాస్, ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జిడి ముఖేష్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వరదల ముప్పును ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ సమావేశం జరిగింది.












