సదాశివపేట, 2026-11-23
పెండింగ్, విచారణలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జోన్, చార్మినార్ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ అన్నారు. సదాశివపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు ప్రశంసనీయమని ఆయన తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన సదాశివపేట రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి, తనిఖీ చేశారు.
పెండింగ్, విచారణలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జోన్, చార్మినార్ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ అన్నారు. సదాశివపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పని తీరు ప్రశంసనీయమని ఆయన తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సదాశివపేట రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొండాపూర్ పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఆ తర్వాత సర్కిల్ కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు పట్ల డీఐజీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసుల దర్యాప్తు విషయంలో ఎస్హెచ్ఓలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, దర్యాప్తులో అనుసరించాల్సిన మెళకువలు, చట్టపరమైన అంశాలపై వారికి అవగాహన కల్పించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్కు సూచించారు. ప్రతి కేసులో వృత్తి నైపుణ్యంతో, పారదర్శకంగా దర్యాప్తు చేపడుతూ బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని, పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం కొండాపూర్, ఇస్నాపూర్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ, స్టేషన్ల పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులతో పాటు దర్యాప్తు కొనసాగుతున్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆర్థిక నేరాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు తగిన లైటింగ్ సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, జిన్నారం డీఎస్పీ ప్రభాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు సదా నాగరాజు, సదాశివపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

