మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 27
మంచిర్యాల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆకస్మికంగా సందర్శించి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సందర్శించి వివిధ రెవెన్యూ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రపాతుల్లా హుస్సేన్ సమక్షంలో కార్యాలయంలో కొనసాగుతున్న పరిపాలనా వ్యవహారాలు, పెండింగ్ దరఖాస్తులు, వాటి పరిష్కార పురోగతిని పరిశీలించారు.
ముఖ్యంగా హైకోర్టు కేసులకు సంబంధించిన సీసీఎంఎస్ () స్థితిగతులు, ఏఎస్డీడీ రోజువారీ నివేదికల పరిష్కారం, భూ భారతి పథకంలో పాత, కొత్త పెండింగ్ కేసులు, జీవో నంబర్ 58, 59 కింద క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పురోగతిని సమీక్షించారు.
అదేవిధంగా భూదాన్ భూముల వివరాలు, మీ సేవ ద్వారా జారీ చేయాల్సిన పెండింగ్ ధ్రువీకరణ పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల పరిష్కారం, ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్లో ఉన్న ప్రతి దరఖాస్తును ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని, పరిపాలనా ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.
రెవెన్యూ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

