దండేపల్లి, 2026-11-26
దేశంలోని ప్రజల స్వేచ్ఛాయుత, ప్రశాంత జీవనానికి రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
దేశంలోని ప్రజల స్వేచ్ఛాయుత, ప్రశాంత జీవనానికి రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లతో కలిసి పరిశీలించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను అందించిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు, ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తించి నడుచుకోవాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆచరించాలని తెలిపారు.
మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు కేంద్రాలను సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నమోదు ప్రక్రియ చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజలకు పథకం అర్హతలు, ప్రయోజనాలు, నమోదు విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలని, అర్హులైన వారు ఎవరూ మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. లక్షెట్టిపేటలోని గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించి, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టవలసిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. గూడెం గోదావరి పుష్కర ఘాట్ వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల ప్రస్తుత పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని, అవసరమైన సిబ్బంది, యంత్రాంగాన్ని సమకూర్చుకొని పనులలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పుష్కరాల సమయానికి అన్ని పనులు పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ పరిసరాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈ.ఈ., దండేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

