న్యూఢిల్లీ, తాజాగా
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, రామగుండం ప్రజల హక్కులు, స్థానిక యువత ఉపాధి, కార్మికుల సంక్షేమం వంటి కీలక సమస్యలపై న్యూఢిల్లీలో ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలపై వినతి అందించారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, రామగుండం ప్రజల హక్కులు, స్థానిక యువత ఉపాధి, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర స్థాయిలో గళమెత్తారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్‌ను కలిసి పలు కీలక సమస్యలపై వినతి అందించారు.
రామగుండంలో చేపడుతున్న 800×3 మెగావాట్ల NTPC విస్తరణ ప్రాజెక్టులో స్థానికులకే ప్రాధాన్యతతో ఉద్యోగాలు కల్పించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ బలంగా కోరారు. భారీ ప్రాజెక్టులు, విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ స్థానిక యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, ఇది ప్రజల ప్రధాన డిమాండ్ అని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి ఫలాలు ముందుగా స్థానిక ప్రజలకు అందేలా NTPC చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రామగుండం ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య సమస్యలపై కూడా ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల విస్తరణతో ప్రభావితమవుతున్న ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మాతంగి కాలనీల్లో నివసిస్తున్న బాధిత కుటుంబాలకు R&R ప్యాకేజీలు, తగిన సౌకర్యాలు మరియు న్యాయం అందించాలని NTPC యాజమాన్యాన్ని కోరారు.
కార్మికుల సంక్షేమ అంశాలను కూడా ఎంపీ వంశీకృష్ణ ప్రాధాన్యతగా ప్రస్తావించారు. ప్రస్తుతం 'సి' గ్రేడ్‌లో ఉన్న కార్మికులను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అనుగుణంగా 'బి' గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంబంధిత సమస్యలపై స్పందిస్తూ, ప్రతి మూడు నెలలకు నిర్వహిస్తున్న మెడికల్ ఫిట్నెస్ పరీక్షలను సంవత్సరానికి ఒకసారి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ESI సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకురావాలని ఒత్తిడి చేయడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ విధానాన్ని పునఃసమీక్షించి వారికి న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ వినిపించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించి స్పందిస్తామని NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల హక్కులు, స్థానిక యువత ఉపాధి, కార్మికుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.












