ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించడం, 11 శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి నిర్ణయాలు ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాయని నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, హనుమంతు ముదిరాజ్ తో పాటు ఇతర సంఘాల నేతలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజా రవాణాను మరింత బలోపేతం చేస్తాయని, కార్మికులు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి దోహదపడతాయని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సూచించినట్లు సమాచారం.
ఈ పరిణామం ఆర్టీసీ కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సంస్థ పురోగతికి ఈ నిర్ణయాలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.










