సంగారెడ్డి, 2026-08-27
తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ ఎం.డి. జావీద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 15 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏ, డీఆర్ లను తక్షణమే విడుదల చేయాలని, సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు.
అలాగే, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను నెలకు రూ.2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, నూతన ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను దశలవారీగా కాకుండా త్వరితగతిన చెల్లించాలని అన్నారు.
టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్, సెక్రటరీ జనరల్ డా.వైద్యనాథ్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం టీజీఈజేఏసీ నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంగారెడ్డి అదనపు కలెక్టర్ పాండుకు వినతి పత్రం సమర్పించి, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మహాధర్నాలో టీజీఈజేఏసీ జిల్లా నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












